‘మన ఊరు – మన బడి’తో బడులను బాగు చేస్తున్నం

‘మన ఊరు – మన బడి’తో బడులను బాగు చేస్తున్నం

హైదరాబాద్: కరోనా సమయంలో టీచర్ల సేవలు అమోఘమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్ డే సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పూర్వజన్మలో ఎంతో  పుణ్యం చేసుకుంటే తప్ప టీచర్లు కాలేరన్నారు. విద్యా విధానంలో నైతిక విలువలకు పెద్దపీట వేయాలన్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నామన్న మంత్రి... మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు పెడుతున్నామని తెలిపారు. 

ప్రైవేట్ స్కూళ్లను కాదని... పేరెంట్స్ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకి పంపుతున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేసి ఉచిత విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. ‘మన ఊరు – మన బడి’  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తున్నా... కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడంలేదని ఆరోపించారు. చట్ట పరంగా రాష్ట్రానికి  రావాల్సిన నిధులు కూడా కేంద్రం రాకుండా చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రంలోని పాలకులు విద్యా వ్యవస్థ బాగుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.